దేవుడు దుష్ట మానవాళిని నాశనం చేస్తాడు

సహవాసం

మనం చివరిసారిగా కలిసినప్పటి నుండి మీకు జరిగినదాని ఆధారంగా, దేనికి మీరు కృతజ్ఞతతో ఉన్నారు?
ఈ వారం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసింది ఏంటి, మరియు పరిస్థితులు మెరుగ్గాఉండాలంటే మీకు కావలసింది ఏమిటి?
మీ కమ్యూనిటీలోని ప్రజల అవసరాలు ఏమిటి, మరియు మనం తెలియచేసిన అవసరాలను తీర్చడంలో ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోవచ్చు?
మనం గతసారి కలిసినప్పుడు నేర్చుకున్న కథ ఏమిటి? దేవుని గురించి మరియు ప్రజల గురించి మనం ఏమి నేర్చుకున్నాము ?
మన గత సమావేశంలో, మీరు నేర్చుకున్న వాటిని అన్వయించుకోవాలని నిర్ణయించుకున్నారు . మీరు ఏమి చేసారు మరియు అది ఎలా జరిగింది?
గత కథలోని విషయాలను మీరు ఎవరితో పంచుకున్నారు? వారు ఎలా స్పందించారు?
మనం చివరిసారి కలిసినప్పుడు అనేక అవసరాలను గుర్తించాము మరియు ఆ అవసరాలను తీర్చడానికి ప్రణాళిక వేసుకున్నాము. అది ఎలా జరిగింది?
ఇప్పుడు, దేవుని నుండి ఒక కొత్త కథ విందాం...

ఆదికాండము 6: 5-6

మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.

ఆదికాండము 6: 9-22

నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు. ¹⁰ షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు. ¹¹ దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది. ¹² దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు. ¹³ దేవుడు నోవహుతో “మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను. ¹⁴ కోనిఫర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి. ¹⁵ నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి. ¹⁶ ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దాన్ని చెయ్యాలి. ¹⁷ విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి. ¹⁸ కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు. ¹⁹ నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, శరీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి. ²⁰ అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి. ²¹ తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి” అని చెప్పాడు. ²² దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.

ఆదికాండము 7: 17-24

¹⁷ ఆ జలప్రళయం నలభై రోజులు భూమి మీదికి వచ్చినప్పుడు, నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది. ¹⁸ నీళ్ళు భూమి మీద భీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు, ఆ ఓడ నీళ్ళ మీద తేలింది. ¹⁹ ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాశం కింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి. ²⁰ ఉన్నత పర్వత శిఖరాలకన్నా పదిహేను మూరలు ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి. ²¹ పక్షులు, పశువులు, మృగాలు భూమిమీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు. ²² పొడి నేలమీద ఉన్న వాటన్నిటిలో, నాసికారంధ్రాల్లో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి. ²³ మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమిమీద ఉండకుండాా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి. ²⁴ నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.

అన్వయింపు

ఇప్పుడు, ఈ వచనాన్ని వినని స్నేహితుడికి చెప్పినట్లుగా ఎవరైనా ఈ వచనాన్ని తమ సొంత మాటలతో చెప్పనివ్వండి. ఏదైనా విడిచిపెట్టినా లేదా పొరపాటున ఏదైనా చేర్చినా వారికి సహాయం చేద్దాం. అలా జరిగితే మనం "కథలో అది ఎక్కడ కనిపిస్తుంది?" అని అడగవచ్చు.
ఈ కథ దేవుని గురించి, ఆయన స్వభావం గురించి, ఆయన చేసే పనుల గురించి మనకు ఏమి బోధిస్తుంది?
ఈ కథ నుండి మన గురించి, మరియు ఇతరుల గురించి మనం ఏమి నేర్చుకుంటాము?
ఈ వారం మీ జీవితంలో ఈ కథలోని దేవుని సత్యాన్ని మీరు ఎలా అన్వయించుకుంటారు? మీరు చేసే నిర్దిష్ట చర్య లేదా పని ఏమిటి?
మనం తిరిగి కలవడానికి ముందు ఈ కథ నుండి ఒక సత్యాన్ని ఎవరితో పంచుకుంటారు? మనలాగే ఈ యాప్‌లో దేవుని వాక్యాన్ని కనుగొనడం ఇష్టపడే ఇతరులు మీకు తెలుసా?
మన సమావేశం ముగిసే సమయానికి, మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మరియు మన తదుపరి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో నిర్ణయించుకుందాం.
కలిసి గడిపిన ఈ సమయం చాలా బాగుంది. మీరు ఏమి చేస్తారని చెప్పారో గమనించమని మరియు మనం మళ్ళీ కలిసే ముందు రోజుల్లో ఈ కథను మళ్ళీ వినమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఎవరి దగ్గరైనా కథ టెక్స్ట్ లేదా ఆడియో లేకపోతే ఫెసిలిటేటర్ వారితో పంచుకోవచ్చు. మనం ముందుకు వెళ్తూ, మనకు సహాయం చేయమని ప్రభువును అడుగుదాం.

0:00

0:00