మోషేకు దేవుని పిలుపు

సహవాసం

మనం చివరిసారిగా కలిసినప్పటి నుండి మీకు జరిగినదాని ఆధారంగా, దేనికి మీరు కృతజ్ఞతతో ఉన్నారు?
ఈ వారం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసింది ఏంటి, మరియు పరిస్థితులు మెరుగ్గాఉండాలంటే మీకు కావలసింది ఏమిటి?
మీ కమ్యూనిటీలోని ప్రజల అవసరాలు ఏమిటి, మరియు మనం తెలియచేసిన అవసరాలను తీర్చడంలో ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోవచ్చు?
మనం గతసారి కలిసినప్పుడు నేర్చుకున్న కథ ఏమిటి? దేవుని గురించి మరియు ప్రజల గురించి మనం ఏమి నేర్చుకున్నాము ?
మన గత సమావేశంలో, మీరు నేర్చుకున్న వాటిని అన్వయించుకోవాలని నిర్ణయించుకున్నారు . మీరు ఏమి చేసారు మరియు అది ఎలా జరిగింది?
గత కథలోని విషయాలను మీరు ఎవరితో పంచుకున్నారు? వారు ఎలా స్పందించారు?
మనం చివరిసారి కలిసినప్పుడు అనేక అవసరాలను గుర్తించాము మరియు ఆ అవసరాలను తీర్చడానికి ప్రణాళిక వేసుకున్నాము. అది ఎలా జరిగింది?
ఇప్పుడు, దేవుని నుండి ఒక కొత్త కథ విందాం...

నిర్గమకాండము 2: 23-3: 14

²³ ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి. ²⁴ దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ²⁵ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు. ¹ మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు. ² అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు. ³ అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు. దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు “మోషే, మోషే” అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. అందుకు ఆయన “దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది” అన్నాడు. ఆయన ఇంకా “నేను నీ పూర్వికులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి” అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు. యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు. కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను. ¹⁰ నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.” ¹¹ అప్పుడు మోషే దేవునితో “ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?” అని అన్నాడు. ¹² దేవుడు “నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన” అన్నాడు. ¹³ మోషే “నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ‘ఆయన పేరేమిటి?’ అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?” అని దేవుణ్ణి అడిగాడు. ¹⁴ అందుకు దేవుడు “నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు.

నిర్గమకాండము 7: 1-5

¹ యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు. ² నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు. ³ అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను. అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.”

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.

అన్వయింపు

ఇప్పుడు, ఈ వచనాన్ని వినని స్నేహితుడికి చెప్పినట్లుగా ఎవరైనా ఈ వచనాన్ని తమ సొంత మాటలతో చెప్పనివ్వండి. ఏదైనా విడిచిపెట్టినా లేదా పొరపాటున ఏదైనా చేర్చినా వారికి సహాయం చేద్దాం. అలా జరిగితే మనం "కథలో అది ఎక్కడ కనిపిస్తుంది?" అని అడగవచ్చు.
ఈ కథ దేవుని గురించి, ఆయన స్వభావం గురించి, ఆయన చేసే పనుల గురించి మనకు ఏమి బోధిస్తుంది?
ఈ కథ నుండి మన గురించి, మరియు ఇతరుల గురించి మనం ఏమి నేర్చుకుంటాము?
ఈ వారం మీ జీవితంలో ఈ కథలోని దేవుని సత్యాన్ని మీరు ఎలా అన్వయించుకుంటారు? మీరు చేసే నిర్దిష్ట చర్య లేదా పని ఏమిటి?
మనం తిరిగి కలవడానికి ముందు ఈ కథ నుండి ఒక సత్యాన్ని ఎవరితో పంచుకుంటారు? మనలాగే ఈ యాప్‌లో దేవుని వాక్యాన్ని కనుగొనడం ఇష్టపడే ఇతరులు మీకు తెలుసా?
మన సమావేశం ముగిసే సమయానికి, మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మరియు మన తదుపరి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో నిర్ణయించుకుందాం.
కలిసి గడిపిన ఈ సమయం చాలా బాగుంది. మీరు ఏమి చేస్తారని చెప్పారో గమనించమని మరియు మనం మళ్ళీ కలిసే ముందు రోజుల్లో ఈ కథను మళ్ళీ వినమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఎవరి దగ్గరైనా కథ టెక్స్ట్ లేదా ఆడియో లేకపోతే ఫెసిలిటేటర్ వారితో పంచుకోవచ్చు. మనం ముందుకు వెళ్తూ, మనకు సహాయం చేయమని ప్రభువును అడుగుదాం.

0:00

0:00