¹ దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాడు, ² నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే. ³ నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు. ⁴ పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు. ⁵ ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను. ⁶ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకూ నా కరుణ చూపిస్తాను. ⁷ నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు. ⁸ విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. ⁹ నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి. ¹⁰ ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు. ¹¹ ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు. ¹² నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి. ¹³ హత్య చెయ్యకూడదు. ¹⁴ వ్యభిచారం చెయ్యకూడదు. ¹⁵ దొంగతనం చెయ్యకూడదు. ¹⁶ నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. ¹⁷ నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.
¹ యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. ² “ఒక వ్యక్తి తన పొరుగున ఉన్నవాడు తనకు అప్పగించిన దాని విషయంలో అతణ్ణి మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక తన పొరుగున ఉన్నవాణ్ణి పీడించినా ³ అతడు పోగొట్టుకున్న వస్తువు తనకు దొరికినా దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపం అవుతుంది. ⁴ ఇలా పాపం చేసినవాడు అపరాధి. కాబట్టి అలాంటివాడు తను ఇతరుల దగ్గర దోచుకున్నదీ, పీడించి సంపాదించిందీ, లేక తనకు అప్పగించినదీ, తనకు దొరికినదీ తిరిగి ఇచ్చివేయాలి. ⁵ తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి. ⁶ తరువాత అతడు తన అపరాధబలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకుని రావాలి. అపరాధబలిగా మందలోని లోపం లేని పోట్టేలును యాజకుడి దగ్గరికి తీసుకుని రావాలి. దాని విలువను ప్రస్తుత వెల ప్రకారం నిర్థారించాలి. ⁷ యాజకుడు యెహోవా సమక్షంలో అతని పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతడు ఏ ఏ విషయాల్లో అపరాధి అయ్యాడో ఆ విషయాల్లో క్షమాపణ పొందుతాడు.”
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00