¹ యాతనలో ఉన్న దానిపై అలుముకున్న మబ్బు తేలిపోతుంది. పూర్వకాలంలో ఆయన జెబూలూను దేశాన్ని, నఫ్తాలి దేశాన్ని అవమాన పరిచాడు. కాని చివరి కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని, అంటే యొర్దాను అవతలి ప్రదేశాన్ని, అన్యప్రజల గలిలయ ప్రదేశాన్నీ మహిమగల దానిగా చేస్తాడు. ² చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు. చావు నీడ గల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ³ నువ్వు ప్రజలను విస్తరింపజేశావు. వాళ్ళ సంతోషం వృద్ధి చేశావు. కోతకాలంలో మనుషులు సంతోషంగా ఉన్నట్టు, కొల్లసొమ్ము పంచుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు నీ సన్నిధిలో సంతోషంగా ఉన్నారు. ⁴ మిద్యాను దినాన జరిగినట్టు అతని బరువైన కాడిని నువ్వు విరిచావు. అతని మెడ మీద ఉన్న దుంగను, అతణ్ణి తోలే వాడి కొరడాలను విరగగొట్టావు. ⁵ యుద్ధ శబ్దం చేసే పాద రక్షలు, రక్తంలో పొర్లించిన వస్త్రాలు అగ్నిలో కాలి, ఆ అగ్నికి ఇంధనం ఔతాయి. ⁶ ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు. ⁷ ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.
²⁶ ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో ²⁷ దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ. ²⁸ ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, “అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు” అని పలికాడు. ²⁹ ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా, ³⁰ దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది. ³¹ ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. ³² ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ³³ ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు. ³⁴ మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. ³⁵ ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు. ³⁶ పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల. ³⁷ దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు. ³⁸ అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00