¹ ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజరు అగస్టస్ ఆజ్ఞాపించాడు. ² ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య. ³ అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు. ⁴ యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు. ⁵ తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు. ⁶ వారక్కడ ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి. ⁷ ఆమె తన తొలిచూలు బిడ్డను కని, మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు. ⁸ ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు ⁹ ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు. ¹⁰ అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను. ¹¹ దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ¹² మీకు కొండ గుర్తు ఒకటే. ఒక పసికందు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు” అని వారితో చెప్పాడు. ¹³ ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి, ¹⁴ “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!” అంటూ దేవుణ్ణి స్తుతించారు. ¹⁵ ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు, “జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి,” అని ఒకడితో ఒకడు చెప్పుకుని ¹⁶ త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న పసికందును చూశారు. ¹⁷ ఆ పసికందును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు. ¹⁸ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. ¹⁹ మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది. ²⁰ ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00