³⁵ ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. ³⁶ శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి. ³⁷ అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. ³⁸ పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు. ³⁹ ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది. ⁴⁰ అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు. ⁴¹ వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు. ¹ వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు. ² యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు. ³ వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు. ⁴ వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు. ⁵ వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు. ⁶ వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు. ⁷ “యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు. ⁸ ఎందుకంటే యేసు అతనితో, “అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!” అని అన్నాడు. ⁹ ఆయన, “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు. ¹⁰ అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు. ¹¹ ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ¹² ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి. ¹³ యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి. ¹⁴ ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. ¹⁵ వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది. ¹⁶ అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు. ¹⁷ వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు. ¹⁸ యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు. ¹⁹ కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, “నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు” అని అన్నాడు. ²⁰ అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00