⁹ తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ¹⁰ “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. ¹¹ పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ¹² వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ¹³ అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు. ¹⁴ పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది. ¹⁵ తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు. ¹⁶ అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే. ¹⁷ చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. ¹⁸ ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. ¹⁹ అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు. ²⁰ వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు. ²¹ దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. ²² యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. ²³ అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. ²⁴ యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. ²⁵ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు. ²⁶ ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు ²⁷ అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు. ²⁸ అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” ²⁹ అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి, ³⁰ ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00