¹ అది పస్కా పండగకు ముందు సమయం. తాను ఈ లోకం విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చిందని యేసు గ్రహించాడు. ఈ లోకంలో ఉన్న తన సొంత వారిని ఆయన ప్రేమించాడు. చివరి వరకూ ఆయన వారిని ప్రేమించాడు. ² యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు. అప్పటికే సాతాను సీమోను కొడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో యేసును అప్పగించాలనే ఉద్దేశం పెట్టాడు. ³ తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు. ⁴ ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. ⁵ అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు. ⁶ ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అప్పుడు పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?” అన్నాడు. ⁷ యేసు అతనికి జవాబిస్తూ, “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు. కాని, నువ్వు తరవాత అర్థం చేసుకుంటావు” అన్నాడు. ⁸ పేతురు ఆయనతో, “నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు” అన్నాడు. ⁹ సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నా కాళ్ళు మాత్రమే కాదు. నా చేతులు, నా తల కూడా కడుగు” అన్నాడు. ¹⁰ యేసు అతనితో, “స్నానం చేసినవాడు తన పాదాలు తప్ప ఇంకేమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అతడు పూర్తిగా శుద్ధుడే. మీరూ శుద్ధులే గాని, మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు. ¹¹ ఎందుకంటే, తనకు ద్రోహం చేసేది ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆయన, “మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు. ¹² యేసు వారి కాళ్ళు కడిగి, తన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వారితో, “నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? ¹³ మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని సరిగానే పిలుస్తున్నారు. ¹⁴ బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. ¹⁵ నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను. ¹⁶ నేను మీకు కచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వాణ్ణి పంపినవానికన్నా గొప్పవాడు కాదు. ¹⁷ ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00