³² ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు. ³³ వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు. ³⁴ అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు. ³⁵ ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు. ³⁶ ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ ³⁷ “నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. ³⁸ “ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు. ³⁹ వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు. ⁴⁰ కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? ⁴¹ మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు. ⁴² తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. ⁴³ అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. ⁴⁴ అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది. ⁴⁵ సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది. ⁴⁶ అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు. ⁴⁷ శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు. ⁴⁸ ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. ⁴⁹ ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు. ⁵⁰ యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు. ⁵¹ మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ⁵² అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు. ⁵³ తరువాత ఆయన శరీరాన్ని సిలువపైనుండి దించి, సన్న నారబట్టతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకు ముందు ఎప్పుడూ ఉంచలేదు. ⁵⁴ అది సిద్ధపడే రోజు. విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది. ⁵⁵ అప్పుడు గలిలయ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి ⁵⁶ తిరిగి వెళ్ళి, సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00