¹¹ కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది. ¹² ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు. ¹³ వారు మరియతో “ఎందుకు ఏడుస్తున్నావమ్మా?” అని అడిగారు. దానికి ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అంది. ¹⁴ ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండడం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్టలేదు. ¹⁵ యేసు, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు?” అని ఆమెను అడిగాడు. ఆమె ఆయనను తోటమాలి అనుకుంది. “అయ్యా, ఒకవేళ నువ్వు ఆయనను తీసుకు వెళ్తే ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయనను తీసుకుపోతాను” అంది. ¹⁶ అప్పుడు యేసు ఆమెను చూసి, “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం. ¹⁷ యేసు ఆమెతో, “నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు” అన్నాడు. ¹⁸ మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, “నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు” అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది. ¹⁹ ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. ²⁰ ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు. ²¹ అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. ²² ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. ²³ మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు. ²⁴ పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. ²⁵ మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు. ²⁶ ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు. ²⁷ తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు. ²⁸ దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు. ²⁹ అప్పుడు యేసు, “నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వారు ధన్యులు” అన్నాడు. ³⁰ యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు. ³¹ కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.
⁵⁰ ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ⁵¹ అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ⁵² వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00