⁹ ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు. ¹⁰ వీరంతా కలసి, “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. ¹¹ దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి, ¹² “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు. ¹³ అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను “తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు. ¹⁴ అందుకు నేను “అయ్యా, నీకే తెలుసు” అని జవాబిచ్చాను. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పాడు, “వీరంతా మహా బాధల్లో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు. ¹⁵ అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. ¹⁶ వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ తీవ్రమైన వేడిమిగానీ వారికి తగలదు. ¹⁷ ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే కన్నీటిని ఆయనే తుడిచివేస్తాడు.”
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00