¹ “నేను నిజమైన ద్రాక్ష తీగని. నా తండ్రి ద్రాక్ష రైతు. ² నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దాన్ని కత్తిరించి సరిచేస్తాడు. ³ నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు. ⁴ నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఏ విధంగా ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు. ⁵ నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. ⁶ ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి. ⁷ మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది. ⁸ మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది. ⁹ తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి. ¹⁰ నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు. ¹¹ మీలో నా ఆనందం ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని, ఈ సంగతులు మీతో మాట్లాడాను. ¹² నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. ¹³ స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు. ¹⁴ నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు. ¹⁵ “నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను. ¹⁶ మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను. ¹⁷ మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00