¹ ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు. ² క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. ³⁻⁴ ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు. ⁵ శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. ⁶ శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. ⁷ ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. ⁸ కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. ⁹ దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు. ¹⁰ క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది. ¹¹ చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ¹² కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము. ¹³ మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు. ¹⁴ దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. ¹⁵ ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. ¹⁶ మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. ¹⁷ మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం. ¹⁸ మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00