¹² శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు. ¹³ ఎలాగంటే, యూదులైనా, గ్రీకులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమంతా ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం. ¹⁴ శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది. ¹⁵ పాదం ‘నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. ¹⁶ అలాగే చెవి ‘నేను కన్ను కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. ¹⁷ శరీరమంతా ఒక్క కన్నే ఉంటే ఇక వినడం ఎలా? శరీరమంతా ఒక్క చెవే అయితే వాసన ఎలా చూడాలి? ¹⁸ అందుకే దేవుడు ప్రతి అవయవాన్నీ తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు. ¹⁹ అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది? ²⁰ అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే. ²¹ కాబట్టి కన్ను చేతితో, “నీవు నాకక్కర లేదు” అనీ, తల పాదాలతో, “మీరు నాకక్కర లేదు” అనీ చెప్పడానికి వీలు లేదు. ²² అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి. ²³ శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం. ²⁴⁻²⁵ అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు. ²⁶ కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి. ²⁷ మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. ²⁸ దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. ²⁹ అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. ³⁰ అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. ³¹ కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00