³⁶ “మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి.” ³⁷ వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. ³⁸ దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ³⁹ ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. ⁴⁰ ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు. ⁴¹ అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు. ⁴² వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు. ⁴³ అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. ⁴⁴ నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. ⁴⁵ అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. ⁴⁶ ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, ⁴⁷ ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00