¹ అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు, ² “ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు. ³ కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు. ⁴ మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు. ⁵ వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు. ⁶ విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు. ⁷ సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం. ⁸ మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు. ⁹ ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి. ¹⁰ అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. ¹¹ మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి. ¹² తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00