¹ యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు. ² “నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ విషయం చెప్పు. ఆ కాపరులతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తమ కడుపు నింపుకునే ఇశ్రాయేలీయుల కాపరులకు శిక్ష తప్పదు. కాపరులు గొర్రెలను మేపాలి గదా! ³ మీరు కొవ్విన గొర్రెలను వధించి, కొవ్వు తిని, బొచ్చును కప్పుకుంటారు. కానీ గొర్రెలను మేపరు. ⁴ జబ్బు చేసిన వాటిని మీరు ఆదుకోలేదు. రోగంతో ఉన్న వాటిని మీరు బాగుచేయలేదు. గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. తోలివేసిన వాటిని మళ్ళీ తోలుకు రాలేదు. తప్పిపోయిన వాటిని వెదకలేదు. అంతేకాక మీరు కఠినంగా క్రూరంగా వాటి మీద పెత్తనం చేశారు. ⁵ కాబట్టి, కాపరి లేక అవి చెదరిపోయాయి. చెదరిపోయి అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి. ⁶ నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా ఎత్తయిన ప్రతి కొండ మీదా తిరిగాయి. నా గొర్రెలు ప్రపంచమంతా చెదరిపోయాయి. అయితే వాటిని ఎవరూ వెతకడం లేదు.” ⁷ కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి. ⁸ “కాపరులు లేకుండా నా గొర్రెలు దోపిడీకి గురై అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి. కాపరులు నా గొర్రెలను వెదకలేదు. వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటారు. గొర్రెలను మేపరు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. ⁹ కాబట్టి కాపరులారా యెహోవా మాట వినండి. ¹⁰ “యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. నేను ఆ కాపరులకు విరోధినయ్యాను. నా గొర్రెలను గురించి వారి దగ్గర లెక్క అడుగుతాను. వారిక గొర్రెలు మేపడం మాన్పిస్తాను. కాపరులు తమ కడుపు నింపుకోకుండేలా చేస్తాను. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట్లో నుంచి వాటిని తప్పిస్తాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. ¹¹ యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నేనే స్వయంగా నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను. ¹² తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకే విధంగా నేను నా గొర్రెలను వెతికి, మబ్బులు కమ్మి చీకటి అయిన రోజున అవి ఎక్కడెక్కడ చెదరిపోయాయో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి, ¹³ ఇతర ప్రజల మధ్యనుంచి వాటిని తోడుకు వచ్చి, వాటి స్వదేశంలోకి తీసుకొస్తాను. ఇశ్రాయేలు కొండల మీద, వాగుల దగ్గర, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను. ¹⁴ నేను మంచి మేత ఉన్న చోట వాటిని మేపుతాను. ఇశ్రాయేలు ఎత్తయిన కొండలు వాటికి మేత స్థలంగా ఉంటాయి. అక్కడ అవి మంచి మేత ఉన్న చోట పడుకుంటాయి. ఇశ్రాయేలు కొండల మీద మంచి పచ్చిక మైదానాల్లో అవి మేస్తాయి. ¹⁵ నేనే నా గొర్రెలను మేపి పడుకోబెడతాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. ¹⁶ “తప్పిపోయిన వాటిని నేను వెదకుతాను. తోలివేసిన వాటిని మళ్ళీ తీసుకొస్తాను. గాయపడిన వాటికి కట్టుకడతాను. బలంలేని వాటికి బలం కలిగిస్తాను. అయితే కొవ్విన వాటినీ బలంగా ఉన్న వాటినీ నాశనం చేస్తాను. మందను న్యాయంతో కాస్తాను.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00