¹ మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే. ² ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి. ³ అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు. ⁴ తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి. ⁵ వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి. ⁶ యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు. ⁷ అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే. ⁸ నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు. ⁹ నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. ¹⁰ దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను. ¹¹ నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు. ¹² జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది. ¹³ జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు. ¹⁴ నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు. ¹⁵ నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను. ¹⁶ ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి. ¹⁷ నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ¹⁸ నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.”
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00