¹⁷ అతడు మిలేతులో ఉండగానే ఎఫెసులోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు. ¹⁸ వారు వచ్చినపుడు వారితో ఇలా అన్నాడు, “నేను ఆసియలో కాలు మోపిన రోజు నుండి మీ మధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు. ¹⁹ యూదుల కుట్రల వలన నాకు విషమ పరీక్షలు సంభవించినా కన్నీటితోనూ, సంపూర్ణమైన వినయభావంతోనూ ప్రభువుకు సేవ చేశానని మీకు తెలుసు. ²⁰ మీకు ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను. ²¹ అంతేకాక, దేవుని ఎదుట పశ్చాత్తాప పడి మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచాలని యూదులకూ, గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో, అంతా మీకు తెలుసు. ²² “ఇదిగో, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు. ²³ కానీ, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్షమిస్తూ నా కోసం సంకెళ్ళు, హింసలూ వేచి ఉన్నాయని చెప్పాడని మాత్రం తెలుసు. ²⁴ అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్ష్యాన్ని, ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు. ²⁵ ఇదిగో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను. మీరెవరూ ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుసు. ²⁶ కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను. ²⁷ ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు. ²⁸ “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి. ²⁹ నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు. ³⁰ అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు. ³¹ కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి. ³² ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్ధులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిశాలి. ³³ నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు. ³⁴ నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. ³⁵ మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.” ³⁶ అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు. ³⁷ అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు. ³⁸ మరి ముఖ్యంగా, “మీరు ఇక మీదట నా ముఖం చూడరు” అని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకూ అతనిని సాగనంపారు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00