¹ యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. ² ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు. ³ “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే. ⁴ దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది. ⁵ సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు. ⁶ నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు. ⁷ కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. ⁸ పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ⁹ శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. ¹⁰ నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ¹¹ “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. ¹² అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00