¹ అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. ² పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ³ ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు. ⁴ మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు. ⁵ కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. ⁶ వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది. ⁷ గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. ⁸ కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. ⁹ ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. ¹⁰ ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు. ¹¹ ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు. ¹² కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. ¹³ ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి. ¹⁴ వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. ¹⁵ క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి. ¹⁶ క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి. ¹⁷ మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00