⁸ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన పేరును ప్రకటన చెయ్యండి. ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి. ⁹ ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. ¹⁰ ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక. ¹¹ యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి. ఆయన సన్నిధిని నిత్యం వెదకండి. ¹² ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా, ¹³ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూచక క్రియలను ఆయన నోట పలికిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ¹⁴ ఆయన మన దేవుడు యెహోవా. ఆయన తీర్పులు లోకమంతటా జరుగుతున్నాయి. ¹⁵ ఆయన తను చేసిన నిబంధనను తాను పలికిన ఆజ్ఞలను వెయ్యి తరాలు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ¹⁶ ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని మనస్సుకు తెచ్చుకుంటాడు. ¹⁷ యాకోబుకు కట్టడగా ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా ఆయన స్థిరపరిచింది దీనినే. ¹⁸ ఆయన మాట ఇచ్చాడు. “నేను కనాను భూమిని మీకు వారసత్వంగా ఇస్తాను.” ¹⁹ మీరు లెక్కకు కొద్ది మందిగా ఉన్నప్పుడే, అల్ప సంఖ్యాకులుగా, దేశంలో పరాయివారుగా ఉన్నపుడే ఇలా చెప్పాను. ²⁰ వాళ్ళు జనం నుంచి జనానికి, రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగుతున్నప్పుడు, ²¹ ఆయన ఎవరినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు. వారి నిమిత్తం రాజులను గద్దించాడు. ²² నేను అభిషేకించిన వాళ్ళను ముట్టవద్దనీ, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనీ చెప్పాడు. ²³ సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి. ²⁴ అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి. ²⁵ యెహోవా మహా ఘనత వహించినవాడు. ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు. సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు. ²⁶ జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే. యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు. ²⁷ ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి. ²⁸ జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి. మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి. ²⁹ యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి. పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని ఆయన ముందు సాగిలపడండి. ³⁰ భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి. అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది. అప్పుడది స్థిరంగా ఉంటుంది. ³¹ యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి. ఆకాశాలు ఆనందించు గాక. భూమి సంతోషించు గాక ³² సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక. పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక. యెహోవా వస్తున్నాడు. ³³ భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు. వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి. ³⁴ యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయనను స్తుతించండి. ³⁵ దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు. మమ్మల్ని సమకూర్చు. ³⁶ మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు అని ఆయన్ను బతిమాలుకోండి. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక. ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00