¹ సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ² ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు. ³ ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు. ⁴ ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది. ⁵ ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా? ⁶ వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి. ⁷ మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు. ⁸ ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. ⁹ మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము. ¹⁰ కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00