¹ అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. ² భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ³ అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? ⁴ అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు. ⁵ అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది. ⁶ అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు. ⁷ సుమారు మూడుగంటల తరువాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది. ⁸ అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది. ⁹ అందుకు పేతురు, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికుని పోతారు” అని ఆమెతో చెప్పాడు. ¹⁰ వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు. ¹¹ సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00