³¹ “మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ³² మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు ³³ ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు. ³⁴ తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. ³⁵ ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. ³⁶ బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు. ³⁷ అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? ³⁸ ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? ³⁹ ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. ⁴⁰ అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు. ⁴¹ “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. ⁴² ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. ⁴³ పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు. ⁴⁴ అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. ⁴⁵ అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. ⁴⁶ వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00