¹⁶ నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన. ¹⁷ దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు. ¹⁸ అలాటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కులను పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం. ¹⁹ నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను. ²⁰ యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను. ²¹ దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను. ²² బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను. ²³ సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ. ²⁴ పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి. ²⁵ అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము. ²⁶ కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. ²⁷ ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.
0:00
0:00